అశ్లీలం మాత్రమే హానికరమా? : "ముని" వాక్యం

ఉద్వేగాన్ని కలిగించనివి, సత్యములు, కోపము పుట్టించనివి, ప్రయోజనకరమైనవి అయిన మాటలు మరియు నిత్య వేద శాస్త్రాల్ని అధ్యయనం చేస్తూ ఉండడం అనేవి వాక్కుకు సంబంధించిన తపస్సు అని గీతాకారుడు చెబుతాడు

Mar 20, 2024 - 07:40
 0  12
అశ్లీలం మాత్రమే హానికరమా? : "ముని" వాక్యం

మనభారత్ న్యూస్, 20 మార్చి 2024, ఆంధ్రప్రదేశ్  :-    భగవద్గీత శ్రద్ధాత్రయ విభాగయోగంలో ఈ శ్లోకం ఉంటుంది (17:15)

అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్‌
స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్మయం తప ఉచ్యతే  

ఉద్వేగాన్ని కలిగించనివి, సత్యములు, కోపము పుట్టించనివి, ప్రయోజనకరమైనవి అయిన మాటలు మరియు నిత్య వేద శాస్త్రాల్ని అధ్యయనం చేస్తూ ఉండడం అనేవి వాక్కుకు సంబంధించిన తపస్సు అని గీతాకారుడు చెబుతాడు.  

ఈ రోజుల్లో ఇలాంటి మాటలకు విలువ ఉన్నదా? ఉద్వేగాలు రేకెత్తించడం కాదు... విద్వేషాగ్నులు రేకెత్తకుండా ఏ ఇద్దరైనా మాట్లాడుకుంటున్నారా? మామూలుగా సరససల్లాప సంభాషణల సంగతి కాదు. ఏదైనా సీరియస్‌ విషయం గురించి చర్చ జరుగుతున్నప్పుడు... ఉద్వేగాలు కలిగించని, కోపాన్ని పుట్టించని రీతిలో మాట్లాడే వాళ్లను మనం చూడగలుగుతున్నామా? ప్రయోజనకరమైన మాటలే రావడం అసలు జరుగుతోందా? వేదాలను చదవడం అనేది పక్కన పెట్టండి. అసలు నిజాలు మాత్రమే పలకడం మన ఎరుకలో ఉన్నదా? అనే సందేహాలు మనకు కలుగుతాయి.

ప్రత్యేకించి రాజకీయ, సామాజికాంశాలు మాట్లాడేప్పుడు... ప్రతి ఒక్కరికీ వారి వారి సొంత దృక్పథం మాత్రమే ఉంటుంది. వాస్తవిక, వివేచనతో కూడిన దృక్కోణం ఉండదు. ఒక విషయంలో, ఒక వ్యక్తిలో మంచి-చెడులను విడివిడిగా చూడగల నేర్పు గురించి ఎవ్వరూ పట్టించుకోరు. తమ బుద్ధి, దృక్పథానికి తగినట్టుగా సత్యాసత్యాలతో నిమిత్తం లేని మూర్ధ వాదనలతో చెలరేగిపోవడం మాత్రమే జరుగుతూ ఉంటుంది. జర్నలిజంలో, మీడియా యొక్క వివిధ రూపాలలో మనం ఇలాంటి వైఖరులను గమనిస్తూ ఉంటాం.  

ఈ కోణంలోంచి ఇవాళ్టి జర్నలిజం వివిధ రూపాలను కూడా గమనించాల్సిన అవసరం ఉంది. సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతున్న కొద్దీ జర్నలిజం అనేది బహురూపధారి అయింది. ఒకప్పట్లో కేవలం పత్రికలు, కొన్ని దశాబ్దాల నుంచి టీవీ ఛానెళ్లు, వాటికి సమాంతరంగా కాస్త ముందువెనుకగా న్యూస్‌ వెబ్‌ సైట్లు/ పోర్టళ్లు చాలాచాలా రూపాల్లో జర్నలిజం కేటగిరీలోకే వచ్చేస్తున్నాయి. ఆ తర్వాత దశ ఇంకా విశృంఖలమైనది. 

మెయిల్‌ అకౌంట్‌ ఉన్న ప్రతి ఒక్కరూ ఒక మీడియా సంస్థ అధిపతి అయిపోగలరు! బ్లాగ్‌/ పోర్టల్‌ ను మీడియా సంస్థగా భావించుకోగలరు. మొబైల్‌ ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరూ ఒక టీవీ ఛానెల్‌ అధిపతి అయిపోగలరు. యూట్యూబ్‌ వారికి అలాంటి అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. తమకు తోచినదెల్లా చెప్పేస్తూ... ఎంతగా దారితప్పి వ్యవహరిస్తున్నా కూడా ఇలాంటి జర్నలిజం ముసుగును తొడిగి చెలరేగగలరు. పైగా, “ఇండిపెండెంటు జర్నలిస్టు” వంటి ఒక ట్యాగ్‌ లైను కూడా తగిలించుకోగలరు.  

ఆధునిక సమాజం, ఆధునిక సాంకేతికత మనకు ఎలాంటి వెసులుబాటు కలిగిస్తున్నదంటే... ప్రతి వెర్రిపోకడనీ, వెధవ్వేషాన్నీ సమర్థించుకోవడానికి మనవద్ద ఒక అందమైన వాదన ఉంటుంది. ఎవడి డప్పు వాడు కొట్టుకోవడం కోసం మీడియా సంస్థలు బహురూపాల్లో పుట్టినంత వరకు కూడా సమాజానికి ఇబ్బంది లేదు. కానీ, ఎవడి బురద వాడు చల్లేస్తానంటే, తమకు తోచినట్టుగా ఎవరిమీద పడితే వాళ్ల మీద బురదచల్లుతూ చెలరేగిపోతామంటే మాత్రం కాస్త ఆలోచించాల్సిందే. ఇలాంటి పోకడలకు ఒక నియంత్రణ అవసరమా లేదా? అనడిగితే ప్రతి ఒక్కరూ కూడా ఉండాల్సిందే అని అంటారు. కానీ కేందప్రభుత్వంలో మాత్రం అవసరమైన కదలిక మనకు కనిపించదు.  

తాజాగా ఒక వార్త వచ్చింది. కేందప్రభుత్వం చొరవ తీసుకుని అసభ్యకరమైన అశ్లీలంతో కూడిన చిత్రాలను ప్రదర్శిస్తున్నారనే కారణంతో పలు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, సోషల్‌ మీడియా ఖాతాలను కేంద్రం తొలగించింది. ఇలా వేటుకు గురైన వాటిలో 18 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, 19 వెబ్‌ సైట్‌ లు, 10 యాప్‌ లు (గూగుల్‌ ప్లే స్టోర్‌ లో ఏడు, కయాపిల్‌ యాప్‌ స్టోర్‌ లో మూడు), 57 సోషల్‌ మీడియా అకౌంట్లు ఉన్నాయి. ఇవేవీ ఇకమీదట భారత్‌ లో పనిచేయకుండా బ్లాక్‌ చేశారు. 2000 నాటి ఐటీ చట్టం ప్రకారం వాటిమీద చర్యలు తీసుకున్నట్టు కేందమంత్రి వెల్లడించారు. సృజనాత్మక వ్యక్తీకరణ పేరిట అశ్లీలతను వ్యాప్తి చేయరాదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, మీడియా, వినోద రంగాల నిపుణులు, మహిళా బాలల హక్కుల సంస్థలతో సంప్రదింపుల తరవాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం వివరించింది.  

మొత్తానికి ఈ వెబ్సైట్లు తదితరాలు సమాజానికి హానికారకంగా మారుతున్నాయనే ఉద్దేశంతో కేంద్రం వాటిమీద వేటు వేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇలాంటి చర్యలను వ్యతిరేకించే వారు కూడా మనలో ఉంటారు గతంలోనూ కొన్ని అశ్లీల వెబ్‌ సైట్లను నిషేధించినప్పెడు దేశవ్యాప్తంగా ఎంత రచ్చరచ్చ అయిందో మనం చూశాం. సీఏఏ వంటి బిల్లు గురించి దేశంలో ఎంత రచ్చ లేదా చర్చ జరిగిందో, నిరసన వ్యక్తం అయిందో... అశ్లీల వెబ్సెట్ల నిషేధం గురించి కూడా ఇంచుమించుగా అంతే స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది.

అయితే... సీవఏఏ వంటి విషయంలో అభద్రతకు గురైన ఒక వర్గం రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తే... అశ్లీల వెబ్సైట్ల విషయంలో ఆధునిక ఉదార వాదులుగా తమను తాము అభివర్ణించుకునే మేధావులంతా ఇల్లు దాటకుండా సోషల్‌ మీడియా వేదికలమీదనే తమ తమ ఆగ్రహావేశాలను కక్కారు. అశ్లీల వెబ్సెట్లు అందుబాటులో ఉండాల్సిందే, అవి దేశానికి అవసరం అని ఘనంగా వాదించారు. తెలుగు ప్రజలు బాగా వరిగిన వారిలో రాంగోపాల్‌ వర్మ కూడా అలాంటి వాదనను భుజానికెత్తుకున్నారు. బహుశా ఈ విడతలో కూడా... తాజా నిషేధాజ్జల మీద కొంత చర్చ జరగవచ్చు వ్యతిరేకత, నిరసన వ్యక్తం కావొచ్చు.  

ఇప్పుడు మన ప్రస్తావనాంశం వాటి గురించిన బాధ కాదు. అశ్లీల వెబ్‌సైట్లు మాత్రమే సమాజానికి హాని చేస్తున్నాయా? పైన చెప్పుకున్న ఆధునిక జర్నలిజం రూపాల్లోని ఇతర వ్యవహారాలు సమాజానికి చేస్తున్న హాని ఎవ్వరికీ కనిపించడం లేదా? అనేది. నిజానికి అశ్లీల వెబ్సెట్లు చేసే హానికంటె దారుణమైన హాని ఇలాంటి వాటివల్ల సమాజానికి జరుగుతూనే ఉంది.

మనదేశంలో భావవ్యక్తీకరణ హక్కు పుష్కలంగా ఉన్నదనే సంగతిని మనం నిత్యం స్మరణలో ఉంచుకోవాలి. ఎవ్వరు ఏ విషయం మీదనైనా తమ అభిప్రాయాలను యథేచ్చగా చెప్పవచ్చు. పంచుకోవచ్చు. ఒకవైపు రాజ్యాంగం ప్రసాదించిన ఈ ప్రాథమిక హక్కు కళ్లెదురుగా ఉండగానే... సోషల్‌ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టే వారు పదులు, వందల సంఖ్యలో కేసుల పాలవుతున్నారు. కటకటాల వెనక్కు వెళుతున్నారు. ప్రభుత్వాలు కూడా తమ వ్యవహారాల మీద బురదళచల్లే వ్యక్తుల మీద స్పందించినంత ఘోరంగా... వ్యవస్థీకృతంగా జరిగే బురదచల్లుడును పట్టించుకోవడం లేదు.  

పైగా ఆన్‌ లైన్‌ ప్రపంచంలో ముసుగులో ఉంటూ మీడియా సంస్థను నడపడం అనేది ఒక సులువైన వ్యవహారం అయిపోయింది. ప్రతి ఒక్కడూ తాము పెద్ద మీడియా టైకూన్‌ అని అనుకుంటాడు. తన వ్యక్తిగత రాగద్వాషాలను బట్టి కులాన్ని బట్టి రాజకీయ భావజాలాన్ని బట్టి విషం కక్కుతూ చెలరేగుతుంటాడు. ఇలాంటి వారి వల్ల సమాజానికి ఎక్కువ హాని జరుగుతుందా? అశ్లీల వెబ్బెట్ల వల్ల ఎక్కువ హాని జరుగుతుందా? కేంద్రం ఆలోచించాలి.  

అలాగని వారి అభిప్రాయాలను బయటకు చెప్పుకునే స్వేచ్చ లేకుండా కట్టడి చేయాలా? అది నియంతృత్వ పోకడ అనిపించుకోదా? అనే ప్రశ్న రావొచ్చు. చిన్నా పెద్దా ఏ రూపంలో ఉన్న భావవ్యక్తీకరణకు ఉద్దేశించిన ఏ మీడియా సంస్థను/ వ్యవస్థను నిషేధించాలనేది ఉద్దేశం కాదు. క్రమబద్దీకరించాలి. ఏ సంస్థ ఎక్కడినుంచి నడుస్తున్నదో యజమాని ఎవరో అందులో వస్తున్న కంటెంట్‌ కు బాధ్యత ఎవరిదో బయటపెట్టకుండా దొంగచాటుగా నడిచే వెబ్సెట్లు మనకు వేలల్లో ఉంటాయి. సమాజానికి అసలు ప్రమాదం వాటివల్ల ఉంటుంది.  

నిజానికి మోడీ ప్రభుత్వం వీటిని నియంత్రించడానికి నాలుగు పోర్టళ్లను ప్రత్యేకంగా ఆవిష్కరించింది. కానీ అవి సాధిస్తున్న ఫలితం మాత్రం సున్నా. తమ వివరాలను బహిర్గతం చేస్తూ ఎవ్వరు ఏ పనైనా చేయవచ్చు. వ్యక్తిగత సోషల్‌ మీడియా అకౌంట్లలో పోస్టులు పెడుతున్న వారు మాత్రమే కేసుల పాలవుతుండడానికి కారణం అదే. వారి వివరాలు అక్కడ ఓపెన్‌ గా అందుబాటులో ఉన్నాయి. కానీ సంస్థల రూపు దాల్చిన తర్వాత వ్యవహారం అలా కాదు. దొంగచాటుగా నడిపే వెసులుబాటు ఈ దేశంలో ఉంది.  

కేంద్రం వీటిని నియంత్రించడం సాధ్యం కాదా? ఆర్‌ఎన్‌ఐ లాంటి పత్రికలకు అనుమతులిచ్చే, దళారీలను మాత్రమే పెంచిపోషించే వ్యవస్థల చేతిలో ఈ ఏర్పాటును కూడా పెట్టకుండా... పారదర్శకంగా, ఆన్‌ లైన్‌ విధానంలో అనుమతులు, పరిశీలన ఉండే ఏర్పాటు చేయడం సాధ్యం కాదా? ఈ దేశంలో ఒక డొమైన్‌ ఉన్నదంటే... వారు నిర్దిష్ట వ్యవధిలోగా నిర్దిష్ట ప్రమాణాలను పూర్తిచేయాలని లేకపోతే ఆ డొమైన్‌ పనిచేయకుండా పోతుందని... అందరికీ ఒక కామన్‌ హెచ్చరిక పంపడం సాధ్యం కాదా? తద్వారా ఏది పడితే అది ప్రచారంలో పెట్టవచ్చునని అనుకునే వారిలో ఒక జవాబుదారీతనాన్ని తీసుకురావచ్చు కదా.  

అలాంటప్పుడు... చిన్న సంస్థల రూపంలో విషప్రచారాలతో సమాజానికి పెద్ద హాని చేస్తున్న వారు కూడా కొంత ఒళ్లుదగ్గర పెట్టుకుని వ్యవహరిస్తారు కదా అనేది ఆలోచించాలి. కేవలం అశ్లీల వెబ్సైట్లు నిషేధించినంత మాత్రాన... ఈ సమాజానికి జరిగే చేటు ఆగదు. మారుతున్న కాలం, కొత్త సాంకేతిక వస్తున్న క్రమాన్ని బట్టి ఎప్పటికప్పుడు అప్డేట్‌ అవుతూ... ఇలాంటి అనేకానేక నియంత్రణ మార్గాలను నిత్యం అన్వేషిస్తూనే ఉండాలి. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin RajaBharat News is a comprehensive news platform delivering the latest updates from the Telugu states and beyond. With a strong focus on local, national, and international news, RajaBharat News brings timely and accurate coverage of politics, entertainment, sports, business, technology, and more. Whether you're looking for breaking news in Andhra Pradesh and Telangana or want to stay informed about global developments, RajaBharat News offers insightful reporting and in-depth analysis. Stay connected with all the happenings around the world, with a special emphasis on the latest from the Telugu states, all in one place.