పాక్‌ సైన్యం మరొక ఆగడం

May 9, 2023 - 23:48
 0  57
పాక్‌ సైన్యం మరొక ఆగడం

మనభారత్ న్యూస్, 10 మే 2023 : రాజకీయంగా తానే పెంచి పోషించి ప్రధానిగా చేసిన ఇమ్రాన్‌ఖాన్‌ తనపైనే తిరుగుబాటు చేయడాన్ని జీర్ణించుకోలేక నిరుడు ఏప్రిల్‌లో పదవీభ్రష్టుణ్ణి చేసిన సైన్యం చివరకు మంగళవారం ఆయన్ను అరెస్టు చేసి పగ చల్లార్చుకుంది.

అధికారం పోగానే అవినీతి, ఉగ్రవాదం, మత దూషణ, హత్య, హింసాకాండను ప్రోత్సహించటం వంటి 140 ఆరోపణల్లో చిక్కుకుని వీలుదొరికినప్పుడల్లా తమపై విరుచుకుపడుతున్న ఇమ్రాన్‌పై సైన్యం ఆగ్రహావేశాలతో రగిలిపోతోంది. అదును కోసం ఎదురుచూస్తోంది.

కొన్ని కేసుల్లో బెయిల్‌ తెచ్చుకుని ఒక అవినీతి ఆరోపణ కేసులో ఇస్లామాబాద్‌ హైకోర్టుకు హాజరైన ఇమ్రాన్‌ను ఆ కోర్టు ప్రాంగణంలోని గది తలుపులు బద్దలుకొట్టి పారామిలిటరీ బలగాలు తీసుకుపోగలిగాయంటే సైన్యం ఎంత బరితెగించిందో అర్థమవుతుంది. 'ఇది చట్టవిరుద్ధం కాదా? ఇది న్యాయవ్యవస్థ స్వతంత్రతపైనా, న్యాయస్థానంపైనా దాడి కాదా?' అంటూ ఇస్లామా బాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆమర్‌ ఫరూక్‌ ఆక్రోశించటం అక్కడి పరిస్థితికి అద్దం పడుతుంది.

జనరల్‌ ముషార్రఫ్‌ ఏలుబడిలో దానికి వ్యతిరేకంగా దృఢంగా నిలబడిన న్యాయవ్యవస్థ ఇప్పుడు జస్టిస్‌ ఫరూక్‌ ఆక్రోశాన్ని వింటుందా, సైన్యంతో తలపడటానికి సిద్ధపడుతుందా అన్నది చూడాలి. నిరుడు నవంబర్‌లో జరిగిన హత్యాయత్నం నుంచి ఇమ్రాన్‌ క్షేమంగా బయటపడగా అప్పటినుంచీ పాక్‌ సైన్యం తనను చంపడానికి కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపిస్తున్నారు.

తన అరెస్టుకు ముందు ఆయన ఒక వీడియో కూడా విడుదల చేశారు. నిరాధారమైన ఆరోపణలు చేయొద్దని పాక్‌ సైన్యం హెచ్చరించిన కొన్ని గంటలకే ఇమ్రాన్‌ అరెస్టయిన తీరు చూస్తే ఆ దేశం ఇంకా ఆటవిక న్యాయంలోనే బతుకీడుస్తోందని తెలుస్తుంది.

అధికారంలో ఉన్నవారిని కూలదోయటం, నచ్చినవారిని అందలం ఎక్కించటం సైన్యానికి కొత్త గాదు. అలాగే తమ బద్ధ శత్రువులుగా మారినవారిని అంతమొందించేందుకు కూడా వెనకాడదు.

ఇందుకు మాజీ ప్రధానులు జుల్ఫికర్‌ అలీ భుట్టో, ఆయన కుమార్తె బేనజీర్‌ భుట్టో ఉదాహరణలు. భుట్టోను ఒక హత్యకేసులో ఇరికించి విచారణ తంతు నడిపించి 'చట్టబద్ధంగా' ఉరితీస్తే, బేనజీర్‌ను ఎన్నికల ర్యాలీలో ఉండగా కాల్చిచంపారు. పాకిస్తాన్‌ ఏర్పడ్డాక దాదాపు పదేళ్లు ఏదోమేరకు సవ్యంగానే గడిచింది. కానీ ఎన్నికైన ప్రభుత్వంపై 1958లో తొలిసారి అప్పటి సైనిక దళాల చీఫ్‌ జనరల్‌ అయూబ్‌ ఖాన్‌ తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు.

ఆ తర్వాత జనరల్‌ యాహ్యాఖాన్, జనరల్‌ జియావుల్‌ హక్, జనరల్‌ పర్వేజ్‌ ముషార్రఫ్‌లు ఆ తోవనే పోయారు. మధ్య మధ్య పౌర ప్రభుత్వాలు ఏర్పడినా అవన్నీ అల్పాయుష్షు సర్కారులే. బేనజీర్‌ భుట్టో మూడు దఫాలు ప్రధానిగా చేసినా ఎప్పుడూ పూర్తి కాలం కొనసాగలేకపోయారు. ఆమాటకొస్తే నవాజ్‌ షరీఫ్‌ ఎంతోకొంత నయం. ఆయన తొలిసారి ప్రధాని అయిన కొంతకాలానికే ముషార్రఫ్‌ సైనిక తిరుగు బాటు జరిపి ప్రభుత్వాన్ని కూలదోశారు. చివరకు అంతర్జాతీయంగా ఒత్తిళ్లు పెరగటంతో 2008లో ఎన్నికలు నిర్వహించక తప్పలేదు.

అప్పటినుంచీ సైన్యం పంథా మార్చుకుంది. అందువల్లే ఆ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో అధికారంలోకొచ్చిన పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ అయిదేళ్లూ నిరాటంకంగా పాలించింది. అనంతరం 2013 ఎన్నికల్లో నెగ్గిన నవాజ్‌ షరీఫ్‌ సైతం పూర్తికాలం అధికారంలో కొనసాగారు. అలాగని ఆయన నిర్భయంగా పాలించారనడానికి లేదు. సైన్యం నీడలోనే పాలన సాగింది. భారత్‌తో చెలిమికి ఆయన ప్రయత్నించినప్పుడల్లా చొరబాటుదార్లను మన దేశంలో ప్రవేశ పెట్టి విధ్వంసాలకు దిగటం, అధీనరేఖ వద్ద కాల్పులు జరపటం సైన్యానికి పరిపాటయింది.

జనంలో అంతగా పలుకుబడిలేని ఇమ్రాన్‌ నేతృత్వంలోని పాకిస్తాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌(పీటీఐ)కు అండదండలందించి 2018 ఎన్నికల్లో ఆ పార్టీ విజయానికి దోహదపడింది. ఆ ఎన్నికల్లో సైన్యం జరిపిన రిగ్గింగ్‌ వల్లే అదంతా సాధ్యమైందని ఆరోపణలొచ్చాయి. కానీ మూడేళ్లు గడిచేసరికే ఇద్దరికీ చెడింది. నిరుడు ఏప్రిల్‌లో తెరవెనక తతంగం నడిపి విపక్షాలను ఏకంచేసి ఇమ్రాన్‌పై జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం నెగ్గేలా చేసి ఆయన్ను పదవి నుంచి దించగలిగింది. 

సైన్యం సాగించిన దౌష్ట్యాన్ని సామాజిక మాధ్యమాల్లో, కొన్ని చానెళ్లలో చూసిన పాక్‌ భగ్గుమంటోంది. పలు నగరాలు, పట్టణాలు నిరసనలతో హోరెత్తుతున్నాయి. లాహోర్‌లోని సైనిక కోర్‌ కమాండర్‌ నివాసంపై ఆందోళనకారులు దాడి చేయగా, అనేకచోట్ల విధ్వంసం చోటుచేసుకుంది. సైనిక తిరుగుబాటులో అధికారం చేజిక్కించుకుని, బూటకపు ఎన్నికల్లో దేశాధ్యక్షుడైన జియా తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవటానికి మతోన్మాదాన్ని ప్రోత్సహించిన నాటినుంచీ పాక్‌లో మతానిది పైచేయి అయింది.

ఆ తర్వాత అధికారంలోకొచ్చినవారు సైతం ఆ బాటనే పోతున్నారు. మరోపక్క దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఐఎంఎఫ్‌ నుంచి రావాల్సిన 650 కోట్ల డాలర్ల రుణం గత నవంబర్‌నుంచి పెండింగ్‌లో పడింది. వచ్చే నెలలో అది మురిగిపోతుంది. ఇక విదేశీ మారక ద్రవ్యం నిల్వలు పాక్‌ వద్ద 445 కోట్ల డాలర్లు మించి లేవు.

ఆ మొత్తం మహా అయితే ఒక నెల దిగు మతులకు సరిపోతుంది. ఈ సంక్షోభాన్ని అధిగమించడ మెలాగో తెలియక ప్రధాని షెహ్‌బాజ్‌ షరీఫ్‌ అయోమయంలో కూరుకుపోగా, సైన్యం ఇమ్రాన్‌ జోలికిపోయి చేజేతులా మంట రాజేసింది. తాజా పరిణామాల పర్యవసానంగా అది సైనిక పాలనలోకి జారుకున్నా ఆశ్చర్యం లేదు. మన పొరుగు నున్న దేశం కనుక మనం అత్యంత అప్రమత్తంగా ఉండకతప్పదు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin RajaBharat News is a comprehensive news platform delivering the latest updates from the Telugu states and beyond. With a strong focus on local, national, and international news, RajaBharat News brings timely and accurate coverage of politics, entertainment, sports, business, technology, and more. Whether you're looking for breaking news in Andhra Pradesh and Telangana or want to stay informed about global developments, RajaBharat News offers insightful reporting and in-depth analysis. Stay connected with all the happenings around the world, with a special emphasis on the latest from the Telugu states, all in one place.