విమర్శలలో కెల్లా ఆత్మ విమర్శ గొప్పది

Jun 23, 2023 - 05:10
 0  73
విమర్శలలో కెల్లా ఆత్మ విమర్శ గొప్పది

ఆత్మవిమర్శ గొప్పది మోడీజీ!, June 22,2023

=========================

‘విమర్శల్లోకెల్లా ఆత్మవిమర్శ గొప్పది’ అన్నారు పెద్దలు.దయచేసి వారి సూచన పాటించండి మోడీజీ.”వసుదైవ కుటుంబమే మా భారతీయుల నైజం”, ”భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ విశిష్టత”,”ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్‌”అంటూ అంతర్జాతీయ వేదికలపై ‘విశ్వగురువు’లా ప్రవచించారు.

కానీ దేశంలోని వివిధ రాష్ట్రాలలో ‘హిందూ-ముస్లిం’ ‘హిందూ-క్రిస్టియన్‌’ ‘ముస్లిం- క్రిస్టియన్‌’ విద్వేషాలను స్వాగతిస్తున్నారు! ప్రధాని హోదాలో ‘జై భజరంగ బలీ’ అని నినదిస్తున్నారు.ఇంతకూ తమరు విశ్వ గురువులా? విద్వేష రాజకీయవేత్తలా?

యేటా రెండుకోట్ల ఉద్యోగాలు కల్పిస్తాను.–విదేశాల్లోని నల్లధనాన్ని రప్పించి ప్రతి భారతీయుని ఖాతాలో లక్షల రూపాయలు జమ చేయిస్తాను వంటి ఆశాజనక – వాగ్దానాలతో,మీడియా ప్రచార హోరుతో ప్రధాని అయ్యారు.

యేటాకాదు గదా,ఈ తొమ్మిదేండ్లలో రెండు కోట్ల ఉద్యోగాలు కూడా కల్పించలేక పోయారు.పైగా పెద్దనోట్ల రద్దు వంటి అనాలోచిత చర్యతో నాలుగు లక్షల పరిశ్రమలు మూతబడి కోట్లాది ఉద్యోగులు,కార్మికులు వీధిన పడ్డారు.

ఫలితంగా 2023 మార్చికి ప్రభుత్వ గణాంకాల ప్రకారం నమోదు చేసుకున్న నిరుద్యోగులు 29కోట్లు.ఇంకా అసంఘటిత వర్గాల వివరాలు తెలియ రాలేదు.గతంలో కనీవినీ ఎరుగని అతిపెద్ద నిరుద్యోగ రేటిది అంటున్నాయి నివేదికలు!

విదేశీ నల్లధనాన్ని రప్పించటమలా ఉంచితే,”ఎగవేతదారుల వలన 2014 నుంచి,భారతీయ బ్యాంకులు సగటున రోజుకు వందకోట్ల రూపాయలను కోల్పోతున్నాయి’అన్న రిజర్వు బ్యాంకు ప్రకటనను ‘ది ఎకనామిక్‌ టైమ్స్‌’ పత్రిక ప్రచురించింది.

అంతేగాదు యేటా వేలాది కోట్ల నల్లధనం విదేశాలకు తరలి పోతుందని అంతర్జాతీయ నివేదికలు చాటుతున్నాయి.

విజయ్ మాల్యా,మరో 28మంది గుజరాతీ వ్యాపారులు ఎగ్గొట్టిన బ్యాంకు రుణాలు రూ.10లక్షల కోట్లన్న వాస్తవం తమకు తెలియనిది కాదు.

ఎవరెవరు ఎంతెంత నల్లధనం ఏ యే దేశాల్లో దాచారో,ఆ వివరాలను ‘పనామా’ ‘పండోరా’ ‘ప్యారడైజ్‌’ పేపర్లు ప్రకటించాయి.

అయినా సరే ఈడీ,సీబీఐ ఇంకా సదరు వ్యవస్థలను వాళ్ళవైపు వెళ్ళనీయటం లేదెందుకంటున్నారు ప్రజలు!

ప్రజాధనానికి కాపలాదారుగా ఉంటానన్నారు గదా? అంటే ఎవరు ఎంతెగ్గొడుతున్నారో, విదేశాలకెంత తరలించుకెళ్తున్నారో చూస్తుండటమేనా మీ వాగ్దానానికి అర్థం?

అప్పులు,అవినీతిలో మునిగి తేలుతుందన్న ప్రచార హోరుతో గత ప్రభుత్వాన్ని దించి,గద్దెనెక్కిన తమరు తమ పార్టీ నేతలు అభివృద్ధి సంక్షేమ ప్రధాన పరుగులు తీస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్నీ,అప్పుల గద్దెనెక్కిగూడ తన వాగ్దానాలను నెరవేర్చుతున్న ఏపీ ప్రభుత్వాన్నీ,ఆ రాష్ట్రాలను అప్పుల్లో ముంచేస్తున్నారంటూ హేళన చేస్తుంటే… ‘గురువింద గింజ’ గుర్తుకొస్తుంది మోడీజీ!

ఎందుకంటే దశాబ్దాలుగా గత ప్రభుత్వాలన్నీ కేంద్రంలో చేసిన అప్పు రూ.55లక్షల కోట్లు.మీ ప్రభుత్వం కేవలం తొమ్మిదేండ్లలో చేసిన అప్పు రూ.103లక్షల కోట్లు కదా! మరి మీరు దేశాన్ని ముంచుతున్నట్లా,తేల్చుతున్నట్లా?

ఇక అవినీతి ప్రభుత్వాలంటూ బీజేపీయేతర ప్రభుత్వాలను విమర్శిస్తున్న మీరు 40శాతం కమిషన్లు ఇవ్వలేక ఘనమైన బీజేపీ సర్కారు వారి కర్నాటకలో మీ కాంట్రాక్టరు ఆత్మహత్య చేసుకున్నా… ప్రభుత్వపు మంత్రే కోట్లాది అవినీతి నోట్ల కట్టలతో రెడ్‌హ్యాండెండ్‌గా చిక్కినా –

మీ బీజేపీ సర్కారే గోవాలో అవినీతి గబ్బులేపినా మిన్నకుండి పోయారు కదా! ‘బేటీ బచావో బేటీ పడావో’అంటుంటే స్త్రీ జనోద్ధారకుడు మా మోడీ అంటూ పాపం తెగ ఆనంద పడిపోయారు మహిళలు!

కానీ గుజరాత్‌లో బిల్కిస్‌బానో వంటి గర్భిణిని రేప్‌ చేసిన బీజేపీ కార్యకర్తలను,క్షమాభిక్ష పేరిట విడిపించటమే గాక,దండలతో సన్మానించి,హారతులతో స్వాగతిస్తుంటే అలాగే చూస్తుండి పోయిన తమను చూసి విస్తుపోయారు భారతీయ మహిళలు!

ప్రజాస్వామ్య దేవాలయమంటూ కొత్త పార్లమెంటు భవనంలో మీరు ప్రణమిల్లినందుకు హర్షించారు ప్రజలు!

కానీ ఆ దేవాలయం ముందుకొచ్చి ‘మోడీజీ మీ పక్కనే ఉన్న ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌చే లైంగికంగా వేధింపబడిన బాధితులం,మాకు న్యాయం చేయండి’అని మొర పెట్టుకుంటున్న మహిళా రైజ్లర్లను ఈడ్చుకెళ్ళారు పోలీసులు.‘దేశానికే గర్వ కారకులంటూ ప్రశంసిస్తూ వాళ్ళతో ఫొటోలు కూడా దిగారు గదా మీరు.

మరి దేశానికి కీర్తికిరీటాల వంటి వాళ్ళకన్యాయం జరిగితేనే పట్టించుకోని మోడీ పాలనలో ఇంక మాగతేంటని వాపోతున్నారు సాధారణ మహిళలు.

ఇందుకే కాబోలు ‘మహిళలకు ప్రమాదకర దేశాల సూచికలో భారత్‌ కూడా చేరింది! తమ హయాంలో ఇలా జరగటం అవమానకరమనిపించటం లేదా మోడీజీ?

‘మా మోడీ హయాంలో దేశవ్యాపితంగా విస్తరించింది మా పార్టీ’ అంటూ డప్పు గొట్టుకొంటున్నది బీజేపీ! అది ప్రజాభిమానంతోనా? ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చేసా? 

ఎలా విస్తరించిందో మీకూ తెలుసు,దేశానికీ తెలుసు! 2016లో అరుణాచల్ ప్రదేశ్‌,2017లో మణిపూర్‌ అండ్‌ గోవా,2019లో కర్నాటక అండ్‌ సిక్కిం,2020లో మధ్యప్రదేశ్‌,2021లో పుదుచ్చేరి,2022లో మహారాష్ట్రలో బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చి గద్దెనెక్కింది బీజేపీ!అందుకు ఉపయోగించిన ఆయుధం ‘ఈడీ-ఐటీ-సీబీఐ త్రిశూలం!

దానితో మీరు చేయించిన దాడులు 5,422.వాటిలో ఛార్జిషీటు వేసినవి 999 అయితే నిరూపించబడినవి కేవలం 23 కేసులు మాత్రమే!

మీరు చేయించిన దాడులలో 97శాతం ప్రతిపక్ష పార్టీల నేతలు,మీకు గిట్టని బిబిసి,ట్విట్టర్‌ వగైరా వ్యాపార సంస్థలపైనేనని పరిశీలకులు తేల్చారు.

దీనిని బట్టి బీజేపీయేతర ప్రజా ప్రతినిధులను బెదిరించి,వచ్చిన వారిని చేర్చుకుని బీజేపీని బలోపేతం చేసుకోవటం,వచ్చిన వాళ్ళపై మోపిన కేసులను అటకెక్కించడం మీరు ప్రవేశపెట్టిన అస్త్రశస్త్రాలే కదా!

షిండేలను రూపొందించి,ఆయా ప్రభుత్వాలను కూల్చడం,ప్రతిపక్షాల ఆర్థిక మూలాలను దెబ్బతీయటం,వాళ్ళను అవినీతి పరులుగా ప్రజల్లో అపఖ్యాతిపాలు చేయటమే బీజేపీ లక్ష్యాలని ఇప్పటికర్థమైంది ఆయా పార్టీలకు,ప్రజలకు కూడా! 

కోట్లాది రూపాయల ప్రజాధనంతో,గతంలో ఏ ప్రధానీ చేయనన్ని విదేశీ పర్యటనలు చేశారు.కానీ దేశానికొక్క పరిశ్రమనూ తేలేక పోయారు.

అంబానీ,అదానీలకు మాత్రం ఆయా దేశాలతో పలు ప్రాజెక్టులు,కాంట్రాక్టులు,వ్యాపార లావాదేవీలు కుదిర్చి పెట్టారు.అంతర్జాతీయంగా తమరు సాధించిన ఘన విజయమిదే కదా మోడీజీ!

జాతీయంగా చూసినా ఆయిల్స్‌, టెలికాం, విద్యుత్‌, ఇన్సూరెన్స్‌, మీడియాలను అంబానీకి!

ఓడరేవులు, ఎయిర్‌పోర్టులు, రైల్వేస్టేషన్లు, బొగ్గు గనులు, ప్రభుత్వరంగ సంస్థలను అదానీకి కట్టబెట్టారు.ఇక ప్రజలకు మాత్రం తక్కువేం చేసారు.

బోలెడు అప్పులు,అధిక పన్నులు,మన్‌కీ బాత్‌లు,వినసొంపైన నినాదాలు,హావభావాలతో ఉపన్యాసాలు,నిరుద్యోగ,దరిద్య్ర భారాలన్నీ వాళ్ళ నెత్తిన బెట్టారు!

ఇవి ప్రతిపక్షాల వారి మాటలు కావు,జాతీయ,అంతర్జాతీయ నివేదికలు వెల్లడించిన నగ్నసత్యాలు మోడీజీ!

బాబోయ్…నష్టాలతో ఉన్నవంటూ ప్రభుత్వరంగ సంస్థల్ని ఆశ్రిత కార్పొరేట్లకు తెగనమ్ముతున్నారు! పాపం నష్టాలతో ఉన్నవంటూ ప్రయివేటు సంస్థల రుణాలను మాఫీ చేస్తున్నారు.

అలా అప్పులెగేసిన కార్పొరేట్లందరికీ ‘క్లీన్‌చిట్‌’ ఇవ్వమని రిజర్వు బ్యాంకు చేత చెప్పిస్తున్నారు.అవునులే పాపం మళ్ళీ వాళ్ళకు అప్పు పుట్టాలిగదా!

ఆహా ఎంతటి ముందు చూపో తమది! అది సరే దశాబ్దాలపాటు శ్రమించి నిర్మించుకున్న ప్రభుత్వ సంస్థలు,ఓడ రేవులు,రైల్వే స్టేషన్లు వగైరాలను లీజుల పేరిట తెగనమ్మటం దేనికని ప్రజలడుగుతుంటే,మళ్ళీ కొత్త,కొత్త వాటిని నిర్మించుకోవడానికి డబ్బు కావాలి గదా!

అందుకోసం అంటున్నారు.మరి కొత్తవి దేనికి? ఓహో మళ్ళీ అమ్ముకోడానికా? వాహ్వా ఏం మాస్టర్‌ ప్లాన్‌ మోడీజీ! ‘చాయ్ వాలాగా శ్రమించి,ఈస్థాయి కెదిగిన ఒక బీసీ!’

తనకంటూ ఎవరూ లేని,ఏమీ చేసుకోని సర్వసంగ పరిత్యాగి’ప్రజల కోసమే పరిశ్రమిస్తున్న ప్రధాని మా మోడీ అంటూ ఊదరగొడుతున్న మీ బీజేపీ!

కానీ మీరు నెలకు రూ.2.80లక్షల జీతం పుచ్చుకోవటం,లక్షల ఖరీదు చేసే సూటు వేయటం,విదేశాల నుండి ఖరీదైన ఫుడ్‌ తెప్పించుకోవటం,వందల కోట్లతో సువిశాల నివాస భవనాన్ని నిర్మించుకోవటం చూశాక బడా కార్పొరేట్ల కోసం పరిశ్రమిస్తున్న షావుకారు ప్రధాని మీరని భారతీయులిప్పటికి గ్రహించగలిగారు మోడీజీ!!

✍️– పాతూరి వెంకటేశ్వరరావు

*9849081889*

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin RajaBharat News is a comprehensive news platform delivering the latest updates from the Telugu states and beyond. With a strong focus on local, national, and international news, RajaBharat News brings timely and accurate coverage of politics, entertainment, sports, business, technology, and more. Whether you're looking for breaking news in Andhra Pradesh and Telangana or want to stay informed about global developments, RajaBharat News offers insightful reporting and in-depth analysis. Stay connected with all the happenings around the world, with a special emphasis on the latest from the Telugu states, all in one place.